Friday, November 22, 2024

Delhi | రెండేళ్ల తర్వాత హస్తినకు రేణుక చౌదరి.. ఖర్గే సహా పార్టీ పెద్దలతో వరుస భేటీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, గెలుపు వాతావరణం ఇప్పటికే వచ్చేసిందని మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ చేరుకున్న ఆమె, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాకరేను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ నేతలకు బేడీలు వేసిన పోలీసులే ఇప్పుడు సలాం కొడుతున్నారని, ఇదే రేపటి విజయానికి సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ప్రశ్నించగా.. తాను కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమైన నేతను కాదని చెప్పారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి నేతల చేరికపై స్పందన కోరగా.. పార్టీలోకి ఎవరొచ్చినా మంచిదేనని సమాధానం చెప్పారు. పొంగులేటి సహా మరో పది మంది వస్తున్నారని, పార్టీని గెలిపించి ప్రజా పాలన తీసుకురావడం కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పొంగులేటి చేరికను రేణుక చౌదరి వ్యతిరేకిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. అయితే ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన తర్వాత మాత్రం పొంగులేటి చేరికను స్వాగతిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.

- Advertisement -

అదే సమయంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ గురించి ప్రస్తావించగా.. ఎవరు చెప్పారని ఆమె ఎదురు ప్రశ్నించారు. ఇది కేవలం చర్చ మాత్రమేనని, చర్చలకు జీఎస్టీ లేదు కాబట్టి ఏదైనా చర్చించవచ్చని అన్నారు. పార్టీలో కార్యకర్తలను బలోపేతం చేయాలని, ముఖ్యంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేవారిని గుర్తించి ప్రోత్సహించడంతో పాటు వారిని ఎలా కాపాడుకోవాలన్నదే చర్చనీయాంశమని రేణుక చౌదరి అన్నారు. ఎన్నికల తర్వాత రేణుక చౌదరి ఎక్కడ ఉంటారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనను ఎప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తగా చూడొచ్చని, మాజీలు – రాజీలు అంటూ ఏమీ ఉండవని ఆమె చమత్కారంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు పాట్నాలో జనతాదళ్ (యునైటెడ్) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశం గురించి ప్రశ్నించగా.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడమే ఒక గొప్ప సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలన్నింటిలో ఒకే తరహా భావన, ఆలోచన కనిపించడం సంతోషకరమని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement