హైదరాబాద్, ఆంధ్రప్రభ : వేతన సవరణ ఉత్కంఠ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఊపందుకున్నది. మొదటి వేతన సవరణ సంఘం గడువు ముగియడంతో కొత్త పీఆర్సీ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఏప్రిల్‌లో సపీఆర్సీ అమలుకు కట్టుబడి ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ఏడాది ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా పీఆర్సీ ప్రకటనపై కొంత స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ఆ ప్రకటనను వాస్తవంలోకి తెచ్చేలా కార్యాచరణ ముమ్మరం చేయనున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నట్లుగానే ఎన్నికల్లోపు కొత్త వేతనాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యతతో ప్రయత్నాలు చేస్తున్నది.
ప్రస్తుత పీర్సీ కాలం జూన్ 30తో ముగియనున్నది. జూలై 1నుంచి రెండో పీఆర్సీ వేతనాలు అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం రెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉద్యోగులనుంచి ఫిట్‌మెంట్ ప్రతిపాదనలు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేతలతో సంప్రదింపులు, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌లో నిత్యావసరాలు, కేంద్ర, రాష్ట్రాల పీఆర్సీలను అధ్యయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌ను నిర్దారించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే దీనిని క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జీవోలు అధికారికంగా విడుదలవుతాయి. సాధారణంగా ఉద్యోగుల వేతనాలను ప్రతీ ఐదేళ్లకోసారి సవరించాల్సిందిగా చట్టంలో ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా పీఆర్సీని ఏర్పాటు చేసి సిఫార్సులకు ప్రభుత్వం కోరాలి. ఆ తర్వాతే కసరత్తు మొదలు పెట్టాలి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పీఆర్సీని 2018 మే 18న ఏర్పాటు చేశారు. ఈ సంఘం 2018 జూలై 1నుంచి కొత్త వేతనాలను అమలు చేయాల్సి ఉంది. రిటైర్డ్ ఐఏఎస్‌లతో త్వరలో 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఫెన్షనర్లు దాదాపుగా 10లక్షలకుపైగా భారీ ప్రయోజనం పొందనున్నారు. గత పీఆర్సీ 7.5శాతం ఫిట్‌మెంట్ రికమండ్ చేసినా సీఎం కేసీఆర్ 2021 మార్చి 22న 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఇక 80వేల పైచిలుకు నోటిఫికేషన్లతో ఉద్యోగ భర్తీకి కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1000కోట్లు అదనంగా కేటాయించగా, పీఆర్సీకి సానుకూలంగా ఉన్నామని సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమిషన్ ప్రకటనపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొన్నది. 2020 డిసెంబర్ 31న పీఆర్సి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఉద్యోగుల మూలవేతనాల్లో 7.5శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసింది. కానీ సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి 2021 మార్చి 22న అసెంబ్లిdలో 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. 2018 జూలై 1నాటికి చెందిన కరవు భత్యం 30.392 శాతాన్ని కూడా వేతనాల్లో కలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటినుంచే పీఆర్సీ కసరత్తు మొదలు పెట్టింది.
జాప్యం కాకుండా…
కొత్త కమిషన్ ఏర్పాటు కాగానే అన్ని శాఖల స్పెషల్ సీఎస్‌లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు శాఖలవారీగా ఉద్యోగులకు చెందిన పలు వివరాలను కోరుతూ నోట్‌ను జారీ చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సాధారణ, ప్రత్యేక, తాత్కాలిక సర్వీస్ రూల్స్‌ను పరిశీలించనుంది. పీఆర్‌సీ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీలలోని నాన్ టీచింగ్ స్టాఫ్, వర్క్ చార్జ్‌డ్ ఎంప్లాయీస్, ఫుల్‌టైం కాంటింజెంట్ ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనం ఎంతమేర సౌలభ్యంగా ఉంటుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది.