Saturday, November 23, 2024

ఎంటెక్‌ సెకండ్‌ ఫేజ్‌ తర్వాతే.. బీఫార్మసీ ప్రవేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలను నవంబర్‌లో చేపట్టనున్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించి ఎప్పుడెప్పుడా అని కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్‌ బైపీసీ విద్యార్థుల బీఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌, బీఫార్మసీ, ఫార్మ్‌-డిలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ను సైతం నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల చివరి వారంలో రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టి ఇంజనీరింగ్‌ సీట్లు, ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు కేటాయించిన బీఫార్మసీ, ఫార్మ్‌డి సీట్లను భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఇందులో మిగిలిన ఫార్మసీ సీట్లను కలిపి ప్రత్యేకంగా ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు బీఫార్మసీ, ఫార్మ్‌డి కౌన్సెలింగ్‌ను చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఫార్మసీ కాలేజీలు దాదాపు 115 ఉంటే అందులో ప్రభుత్వ యూనివర్సిటీ పరిధిలో 4 కాలేజీలు, ప్రైవేట్‌ యూనివర్సిటీ కాలేజీ ఒకటి, 110 ప్రైవేట్‌ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం దాదాపు 8వేలకు పైగా సీట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 4199 సీట్లకు ఎంపీసీ స్ట్రీమ్‌ విద్యార్థుల కోసం ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ను చేపట్టారు. ఈ మొత్తం సీట్లు ఎప్పుడూ భర్తీ కావు. అలాగే ఇంకా సెకండ్‌ ఫేజ్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు విడతల్లో భర్తీ అయిన సీట్లుపోనూ మిగిలిన సీట్లను కలిపి మొత్తం 8వేల ఫార్మసీ సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మరోవైపు నీట్‌ ఫలితాలు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి. అందులో సీట్లు పొందని వారు ఫార్మసీ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తారు. ఈ నెల చివరి కల్లా ఈ ప్రక్రియ ముగిసినా నవంబర్‌ మొదటి వారంలో బీఫార్మసీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడత చేపట్టిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఫార్మ్‌డి 571 సీట్లల్లో 36 భర్తీ అయ్యాయి. అలాగే 3628 బీఫార్మ్‌ సీట్లల్లో 135 మంది విద్యార్థులు కాలేజీల్లో సెల్ప్‌ రిపోర్టింగ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement