హైదరాబాద్, ఆంధ్రప్రభ : చైతన్య భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ), మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంజీఐటీ) కాలేజీల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంచిన ఫీజు గత 2016-17 నుంచి 2018-19 బ్లాక్ పిరియడ్కు సంబంధించింది మాత్రమే. గురువారం టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో కళాశాలల యాజమాన్యాలతో అధికారులు సమావేశం నిర్వహించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2016-19 బ్లాక్ పిరియడ్కు సంబంధించి సీబీఐటీ, ఎంజీఐటీ యాజాన్యాలు తమ కాలేజీల ఇంజనీరింగ్ ఫీజులను పెంచాలని టీఏఎఫ్ఆర్సీని అప్పట్లో కోరగా అందుకు టీఏఎఫ్ఆర్సీ నిరాకరించింది. దాంతో కాలేజీ యాజమాన్యాలు 2017-18 విద్యా సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు సీబీఐటికి రూ.2 లక్షలు… ఎంజీఐటికి రూ.1.60 లక్షలుగా ఫీజును నిర్ణయించింది. దీంతో టీఏఎస్ఆర్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాలేజీ యాజమాన్యాలు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టుకు వెళ్లాలని.. తీర్పుపై రివ్యూ చేయాలని సూచించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు టీఏఎఫ్ఆర్సీ సీబీఐటీ, ఎంజీఐటీ ఫీజుల ఖరారుపై ఒక సబ్ కమిటీని గతంలో నియమించింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, జేఎన్టియూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ కమిటీలో ఉన్నారు. కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశం నిర్వహించిన అనంతరం తమ ప్రతిపాదనలను టీఏఎఫ్ఆర్సీకి గురువారం సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐటీకి గతంలో నిర్ణయించిన రూ.1,13,500 ఫీజు కాకుండా 2016-19 బ్లాక్ పిరియడ్కు సంబంధించి రూ. 1.40 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. అలాగే ఎంజీఐటీకి గతంలో నిర్ణయించినట్టు రూ.1లక్షా కాకుండా రూ. 1.20 లక్షలుగా నిర్ణయించారు.
గతంలోకంటే ఫీజు తగ్గింది…
2016-17 నుంచి 2018-19 బ్లాక్ పిరియడ్కు సంబంధించి సీబీఐటికి ఏఎఫ్ఆర్సీ కొత్తగా నిర్ణయించిన ఫీజు రూ. 1.40 లక్షలు కాగా.. 2019-20 నుంచి 2021-22 బ్లాక్ విరియడ్కు సంబంధించి ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు రూ. 1.34 లక్షలు మాత్రమే కావడం విశేషం. గత బ్లాక్ పిరియడ్ కంటే ప్రస్తుతం కొనసాగుతున్న బ్లాక్ పిరియడ్ ఫీజు దాదాపు రూ. 5 వేలు తక్కువగా ఉంది. ఇక ఎంజీఐటీ ఫీజు కూడా గత బ్లాక్ పిరియడ్లో టీఏఎఫ్ఆర్సీ ముందుగా రూ. లక్ష ఫీజు నిర్ణయించగా.. కోర్టుకు వెళ్లిన అనంతరం ఇప్పుడు రూ. 1.20 లక్షలకు పెంచారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న బ్లాక్ పిరియడ్ ఫీజు మాత్రం రూ.1.08 లక్షలు మాత్రమే. అంటే గత బ్లాక్ పిరియడ్ కంటే కొనసాగుతున్న బ్లాక్ పిరియడ్ 2021-22 ఫీజు రూ.12వేలు తక్కువగా ఉంది.
కొందరు విద్యార్థులకు ఊరట..
2016-17, 2017-18 విద్యా సంవత్సరంలో సీబీఐటీ, ఎంజీఐటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన వారి కోర్సు ఇప్పటికే పూర్తయింది. పాత బ్లాక్ పిరియడ్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఇంజనీరిండ్లో చేరిన వారి విద్యార్థులు ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్లో కొనసాగుతున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో రూ.2 లక్షలు వసూలు చేసి వాటిని ఎఫ్డీ రూపంలో పెట్టాలని సూచించడంతోపాటు ఫీజును ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన అనంతరం వాటిలో ఉన్న తేడాల మేరకు విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజులో తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు మేరకు రూ. 2 లక్షల నుంచి ఎక్కువ వసూలు చేసిన వారికి తిరిగి చెల్లించాలని టీఏఎఫ్ఆర్సీ ఆయా కాలేజీ యాజమాన్యాలకు ఆదేశించినట్టు సమాచారం.
కోర్సు పూర్తయిన వారికి తిరిగి చెల్లిస్తారా?
సీబీఐటి, ఎంజీఐటి కాలేజీలకు పెంచిన ఫీజుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఒకటి, రెండు రోజుల్లో సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత నుంచి ఫీజు అమలులోకి రానుంది. అయితే విద్యర్థులు కొందరు కోర్సు పూర్తయి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సంబంధించి ప్రభుత్వం ఫీజును రీయింబర్స్మెంట్ రూపంలో ఇచ్చింది. ఇప్పుడు పెరిగిన ఫీజులను తిరిగి చెల్లించాలంటే కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే కోర్సు పూర్తయిన విద్యార్థులకు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి