న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ పంపకం దాదాపు కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో ఉమ్మడి ఆస్తిని పంచుకోడానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని రెండు రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు తెలియజేయగా.. సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శితో భేటీ అయ్యారు.
ఏ ప్రాతిపదికన పంపకాలు జరుపుకోవాలన్న విషయంపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, ఆ మేరకు అశోక రోడ్‌కు ఆనుకున్న శబరి బ్లాక్ (3.5 ఎకరాలు), పటౌడీ హౌజ్ ఖాళీ స్థలంలో 5.5 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకునేలా, మిగతా గోదావరి, స్వర్ణముఖి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ ఖాళీ స్థలాలతో పాటు పటౌడీ హౌజ్‌లో మిగిలిన భూభాగం ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా పరస్పర అంగీకారం కుదిరిందని వివరించారు. ఈ అంశంతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న ఇతర అంశాలపై కూడా హోంశాఖ అధికారులతో మాట్లాడినట్టు మల్లు రవి వివరించారు.
హోంశాఖ అధికారులతో సమావేశం అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో హోంశాఖ పంపకాల ప్రక్రియను త్వరలోనే పూర్తిచేయనున్న హామీ ఇచ్చిందని, పంపకాలు పూర్తయిన వెంటనే పటౌడీ హౌజ్ స్థలంలో కొత్త తెలంగాణ భవన్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే శబరి బ్లాక్‌లో ఉన్న ప్రస్తుత భవనాల విస్తరణ లేదంటే కొత్త భవనాల అవసరంపై కూడా సమీక్ష జరుపుతామని వివరించారు.
దీంతో పాటు విపత్త నిర్వహణ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే బడ్జెట్ విడుదల చేస్తామని హోంశాఖ అధికారులు చెప్పారని మల్లు రవి అన్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, ఐపీఎస్ క్యాడర్ పెంచాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. ఈ విషయంపై కూడా హోంశాఖ అధికారులతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల గురించి ప్రతిపాదనలు అందజేసినట్టు తెలిపారు.
తెలంగాణ ప్రజలను అవమానించడమే!
రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాలి గోటికి సరిపోరు అంటూ వ్యాఖ్యానించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని మల్లు రవి అన్నారు. నియంతృత్వ పోకడలతో అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కొద్ది రోజుల క్రితం కనకపు సింహాసనమున అంటూ ఓ సామెతను ఉదహరించడాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రజల మెప్పు పొందేలా పాలన అందజేస్తున్న రేవంత్ రెడ్డిపై బురదజల్లేలా విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు.
కేసీఆర్ వల్ల రేవంత్ రెడ్డి సీఎం కాలేదని, తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే సీఎం అయ్యారని మల్లు రవి గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ గురించి ప్రశ్నించగా.. తాను నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు ఆశిస్తున్నానని, రాజ్యసభ సీటు ఆశించడం లేదని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి రాజ్యసభకు ఎవరెవరిని బరిలోకి దించాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని మల్లు రవి తెలిపారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర పార్టీ కోరిందని, తుది నిర్ణయం సోనియా తీసుకుంటారని తెలిపారు.