అమెరికా 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి చివరి అమెరికా సైనికుడు కూడా కాబూల్‌ను వీడాడు. అయితే ఆ దేశం విడిచి వెళ్లే ముందు అక్కడ తాము విడిచి పెట్టిన అనేక ఎయిర్‌క్రాఫ్ట్, సాయుధ వాహనాలు, ఆయుధాలను అమెరికా సైనికులు పని చేయకుండా చేయడం గమనార్హం. అయితే అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. తుపాకీలతో గాల్లోకి కాల్పులు జరిపి మరీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాకు చెందిన చివరి విమానం అలా ఎగిరిందో లేదో… తాలిబన్లు కాబూల్ ఎయిర్ పోర్టు లోపలకు ఎంటర్ అయిపోయారు. అమెరికా సైన్యం వదిలేసిన యూనిఫారాలు ధరించి.. అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఒక దశలో తమ విజయానికి గుర్తుగా రన్ వేపై నడిచారు. ఎయిర్‌పోర్టును నడపడానికి అమెరికన్ మిలిటరీ కొన్ని పరికరాలను తాలిబాన్ల కోసం వదిలేసింది. వాటిలో రెండు ఫైర్ ట్రక్స్, కొన్ని ఫ్రంట్ ఎండ్ లోడర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెట్లు ఉన్నాయి. కొన్ని హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వాటిని తాలిబన్లు తనిఖీ చేశారు. కాగా తాలిబన్‌లకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వార్త కూడా చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు