న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి (ఏఈఎల్సీ) ఆస్తుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ నేషనల్ క్రిస్టియన్ బోర్డు (ఎన్సీబీ) ఆరోపించింది. ఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలంటూ ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి ఎన్సీబీ చైర్మన్ జాన్ మస్క్ కోరారు. రూ. 5 వేల కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఏఈఎల్సీ ఆస్తుల లీజుల వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కొన్ని ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని, కొన్నింటిని అక్రమ పద్ధతుల్లో అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
వీటన్నింటిపై దర్యాప్తు జరపాలని ఆయన సీబీఐని కోరారు. గుంటూరు కేంద్రంగా ఉన్న ఏఈఎల్సీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. అయితే అక్రమాలపై దర్యాప్తు జరిపితేనే దోషులెవరో తెలుస్తుందని, వారిపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని జాన్ మస్క్ అంటున్నారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏఈఎల్సీయే కాదు.. డబ్ల్యుఎంఈ ఆస్తుల్లోనూ గోల్‌మాల్
కేవలం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి ఆస్తుల్లోనే కాదు, బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ‘వరల్డ్ మిషనరీ ఎవాంజలిజం’ (డబ్ల్యుఎంఈ) ఆస్తులు సైతం అన్యాక్రాంతం అవుతున్నాయని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ జాన్ మస్క్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థకు భారత్‌లో లక్నో కేంద్రంగా ఉన్న బిషప్ అధిపతిగా ఉన్నారని, ఆయన రాజకీయ ప్రముఖులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులున్నాయని, అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 3.5 లక్షల కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు.
వీటిని కారుచౌకగా రాజకీయ ప్రముఖులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. వీటిపై తాను ఇప్పటికే ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆస్తులపై అసలు హక్కుదారులకు తెలీకుండా, దొంగ పత్రాలు సృష్టించి అమ్ముకుంటున్నారని విమర్శించారు. వీటిపై సీబీఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.