ఎన్నికల్లో నేర చరిత నాయకుల సంఖ్య పెరుగుతోంది. కోటీశ్వరుల సంఖ్య కూడా అదే దామాషాలో వృద్ధి చెందుతోంది. గుజరాత్ అసెంబ్లి ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీతోపాటు ఆప్ కూడా నేరచరితులను బరిలోకి దింపింది. రెండవ దశ పోలింగ్ జరగనున్న 93 స్థానాలకు ఈసారి ప్రధాన పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 245మంది (29శాతం) కోటీశ్వరులు. 2017లో ఈ సంఖ్య 199గా (24శాతం) ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం, 163 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత ఎన్నికల్లో నేరస్తుల సంఖ్య 101గా ఉండేది. 92 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.
ప్రధాన పార్టీలలో కాంగ్రెస్ నుంచి 10 మంది, ఆప్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి 14 మంది నేర చరితులు బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులలో తొమ్మిది మంది మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరు అత్యాచార కేసులో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు హత్యానేరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది నేరచరితులు బరిలో ఉన్న నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పేర్కొంటారు. ఇలాంటివి రెండవ దశలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని పార్టీలు సంపన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వడానికి మొగ్గుచూపాయి. కాంగ్రెస్ నుంచి 90 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 77 మంది కోటీశ్వరులే. అదేవిధంగా,బీజేపీ నుంచి 75 మంది, ఆప్ నుంచి 35 మంది కోటికిపైగా ఆస్తులు కలిగివున్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.