Thursday, September 19, 2024

TG | గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లల అడ్మిషన్లు : మంత్రి పొన్నం

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్నారై సెల్ వినోద్ పాల్గొని గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాలపై చర్చించారు.

ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని.. అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభ్యులుగా నియమించి.. ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈనెల 20 నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాల, కళాశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు సూచనలు చేశారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని.. అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని.. ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కార్మికులు గల్ఫ్‌లో మృతి చెందగా… వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి పరిహారం అందిచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరిగానే గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు.

గల్ఫ్ కార్మికులు చనిపోతే మృతదేహం రావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుందని.. 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని తెలిపారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని అక్కడ ఉన్న దానిని స్టడీ చేయాలని సూచించారు. కేరళలో జీడీపీ ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తోందని తెలంగాణ రాష్ట్రంలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement