హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్ విద్యలో వీఆర్వోలను సర్దుబాటు చేసే ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. జిల్లాల వారీగా ఉన్న నాన్‌టీచింగ్ ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేసేవిధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులమేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఆ దిశగా ఇప్పటికే జిల్లాల వారీగా వీఆర్వోల నియామకానికి సంబంధించిన కసరత్తును ప్రారంభించారు. నేడో రేపో వారికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లాల వారీగా కాలేజీల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ల నుండి ఇంటర్ విద్యకు అందాయి.
ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఉన్న ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లుగా కేటాయింపులు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలిపి దాదాపు 300 నుంచి 400 వరకు ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఖాళీ పోస్టుల్లో 28 మందిని టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా నియమించినట్లు లిస్టును తయారు చేశారు. అలాగే ఇతర జిల్లాల్లోని ఖాళీ పోస్టుల్లోనూ వీఆర్వోలను ఇదేవిధంగా సర్దుబాటు చేస్తున్నారు. అయితే వీరిని ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో సర్దుబాటు చేస్తున్నప్పటికీ వీరి క్యాడర్ మాత్రం జూనియర్ అసిస్టెంట్‌గానే ఉంటుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.