హైదరాబాద్, ఆంధ్రప్రభ: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు ఈనెల 23కు వాయిదా పడింది. హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై సిర్పూర్కర్ కమిషన్ అందజేసిన నివేదికపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్కౌంటర్కు గురైన బాధితుల తరపున న్యాయవాది వృందా కార్వెల్ వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ జరిగిన తీరును కోర్టుకు వివరించారు. పోలీసుల కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారని న్యాయవాది తెలిపారు. బాధితుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను వెంటనే అమలు చేయాలని వృందా కార్వెల్ కోరారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 10 మంది పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతుందని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని న్యాయవాది వృందా గోవత్ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈనెల 23న ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.