Saturday, November 23, 2024

ISRO | సౌర మంటల ఎక్స్‌-రే… అధికశక్తి విస్ఫోటనాన్ని సంగ్రహించిన ఆదిత్య ఎల్‌-1

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోలార్‌ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్‌1 సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా, సూర్యుడి ఉపరితలంపై ప్రజ్వలనానికి సంబంధించిన ఫొటోను క్లిక్‌ మనిపించింది. సౌర మంటలను హై-ఎనర్జీ ఎక్స్‌-రేలో బంధించింది. ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకలో అమర్చిన ఏడు పేలోడ్‌లలో ఒకటైన హై ఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌-రే స్పెక్టోమీటర్‌ (హెచ్‌ఇఎల్‌1ఒఎస్‌) అక్టోబర్‌ 29న 12.00 గంటల నుంచి 22.00 గంటల మధ్య తన మొదటి పరిశీలన కాలంలో సౌర మంటల హఠాత్తు దశను విజయవంతంగా రికార్డు చేసింది.

సౌర మంట అనేది సూర్యుడి ఉపరితలం, బాహ్య వాతావరణం నుంచి ఉద్భవించే ఆకస్మిక రేడియేషన్‌ శక్తి. ప్రధానంగా ఎక్స్‌ కిరణాలు, అతినీల లోహిత (యువి) కాంతి రూపంలో సూర్యుని వాతావరణంలో నిల్వచేయబడిన అయస్కాంత శక్తిని విడుదల చేయడం వల్ల సౌరమంటలు ఏర్పడతాయి. సుమారు పది గంటల పాటు కొనసాగిన మొదటి పరిశీలన కాలంలో యూఎస్‌ నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఒఒఎ)కి చెందిన జియోస్టేషనరీ ఆపరేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ శాటిలైట్స్‌ (జిఒఇఎస్‌) అందించిన ఎక్స్‌ రే లైట్‌ కర్వ్‌లకు అనుగుణంగా ఆదిత్యకు అమర్చిన హెచ్‌ఇఎల్‌1ఒఎస్‌ డేటాను సంగ్రహించింది.

- Advertisement -

ఎక్స్‌-కిరణాలు, గామా-కిరణాలలో సౌరమంటల గురించి దశాబ్దాలుగా అధ్యయనం జరుగుతున్నప్పటికీ, ప్రారంభ ఉద్గారాలను వర్గీకరించడం, అర్దం చేసుకోవడం చాలా కష్టమని ఇస్రో తెలిపింది. ఇపల్సివ్‌ హార్డ్‌ ఎక్స్‌-రే ఉద్గారాలు బహుళ స్పెక్ట్రల్‌ భాగాలను కలిగివుంటాయి. విభిన్న శక్తి పరిధులను అందించడానికి ప్రత్యేకంగా టూన్‌ చేయబడిన డిటెక్టర్ల సమితిని కలిగి ఉండటం ద్వారా ఇబ్బందులను అధిగమించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ డిటెక్టర్ల సమితి ఎక్కువ స్పెక్ట్రల్‌, టైమ్‌ రిజల్యూషన్‌ కొలతలను కూడా అందిస్తుందని ఇస్రో వెల్లడించింది. అలాగే, ఆదిత్య ఎల్‌1కు అమర్చిన ఇతర పేలోడ్‌ల నుంచి తదుపరి డేటా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిశోధనలు సూర్యుడిపై మన అవగాహనను పెంపొందించడమే కాకుండా, భూ అయస్కాంత తుపానులను అంచనా వేయడంలో అంతరిక్ష వాతావరణ గతిశీలతను అర్దం చేసుకోవడంలో సహాయపడతాయి. అంతిమంగా అంతరిక్ష ప్రయాణం, ఉపగ్రహ కార్యకలాపాల భద్రత సామర్థ్యానికి దోహదపడతాయని ఇస్రో వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement