న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ప్రస్తుత అవసరాలకు సరిపడా రసాయన ఎరువుల నిల్వలున్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా తెలిపారు. మంగళవారం దేశంలో ఎరువుల లభ్యత, వినియోగంపై రాష్ట్రాల మంత్రుతలోత పాటు సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. మాతృభూమిని కాపాడుకోడానికి ఎరువుల సమతుల్యత అవసరమని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నదే తమ సంకల్పమని ఆయన తెలిపారు. యూరియాను వ్యవసాయం కోసం కాకుండా ఇతర అవసరాల కోసం దారిమళ్లించడాన్ని రాష్ట్రాలు నిరోధించాలని, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ పురోగతి, ప్రత్యామ్నాయ ఎరువులను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడం, ఇందుకు సంబంధించి రాష్ట్రాలు చేపట్టిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రస్తుతం దేశంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలున్నాయని, ఈ స్టాక్ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌తో పాటు రాబోయే రబీ సీజన్ ప్రారంభానికి సరిపోతాయని వెల్లడించారు.
భూసారాన్ని కాపాడేందుకు రసాయనిక ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని డా. మాండవ్య అన్నారు. ‘పీఎం-ప్రణామ్’ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో ఒక అడుగు వేసిందని ఆయన పునరుద్ఘాటించారు. మాతృభూమిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నెమ్మదిగా విడుదల చేసే సల్ఫర్ కోటెడ్ యూరియా (యూరియా గోల్డ్), నానో యూరియా, నానో డిఎపి వంటివి ఈ ప్రయత్నాలలో భాగమేనని అన్నారు. దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల’ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఒకే చోట రైతుల అన్ని అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఈ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ గ్రేడ్ యూరియాను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మళ్లించడంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి రాష్ట్రాల మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా వ్యవసాయ యూరియా మళ్లింపును తగ్గించాలని సూచించారు. అలాగే యూరియా దారిమళ్లించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర వ్యవసాయ శాఖల ఫర్టిలైజర్ ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్త తనిఖీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా వినియోగ యూనిట్లపై 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని, 32 మిక్చర్ యూనిట్ల లైసెన్స్‌లను రద్దు చేశాయని, అలాగే 79 మిక్సింగ్ యూనిట్ల అనుమతి రద్దు చేశామని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం, బ్లాక్ మార్కెటింగ్ నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రాల మంత్రులు సైతం అలాంటివారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదని వెల్లడించారు.