తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెండోసారి వేతన సవరణ అమలు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన వేతన సవరణ కమిషన్ సిఫారసుల ఆధారంగా రాష్ట్రం ఆవిర్భవించిన మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచారు. 2018లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా ఇప్పుడు వేతనాలు పెరగనున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా 30 శాతం ఫిట్‌మెంట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పెరిగిన వేతనాలు ప్రస్తుత నెల నుంచి ఉద్యోగుల చేతికి వస్తాయని.. జులైలో పెరిగిన వేతనం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు వేగవంతం చేసింది. వేతన సవరణ అమలు చేస్తూ అందరి ఉద్యోగుల స్కేళ్లను మార్చాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే డ్రాయింగ్ ఆఫీసర్లు జీతాల బిల్లులు సిద్ధం చేస్తారు. మంత్రివర్గ ఆమోదం నేపథ్యంలో వేతన సవరణ అమలు ఉత్తర్వు జారీ చేసి ఆ తర్వాత స్కేళ్లు ఖరారు చేసే ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 20లోపు పూర్తి చేయాల్సి ఉంది.
రాష్ట్రంలోని 9 లక్షల 21 వేల 37 మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. వేతన పెంపుతో రాష్ట్ర ఖజానాపై ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్ల మేర అదనపు భారం పడనుంది. 2020 ఏప్రిల్ నుంచి వేతన సవరణ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. ఆ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని ఇది వరకే ప్రకటించింది. అయితే పీఆర్సీ అమలు ఆలస్యం కావడంతో 2021 సంవత్సరానికి చెందిన ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పెరిగిన మొత్తం బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాక రెండు లేదా నాలుగు దఫాల్లో ఈ బకాయిలను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంటి అద్దె భత్యం విషయంలో వేతన సవరణ సంఘం సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం వెళ్లనుంది. ఇప్పటి వరకు ఉన్న 30, 20, 14.5, 12 శాతం స్లాబులను 24, 17, 13, 11 శాతానికి కుదించారు. కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా హెచ్ఆర్ఏ స్లాబులను మార్చారు. అయితే హెచ్ఆర్ఏ మీద ఉన్న గరిష్ఠ పరిమితిని మాత్రం తొలగించారు. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.