Tuesday, November 26, 2024

ఐఫోన్‌ల అడ్డాగా తెలంగాణ.. రేపు ఫ్యాక్స్‌కాన్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రపంచ దిగ్గజ కంపెనీలు స్టార్టప్‌ స్టేట్‌ తెలంగాణ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేరొందిన సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలను ప్రారంభించగా.. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ తెలంగాణలో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇవాళ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌ గ్రామంలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ నిర్మాణం చేపడుతోంది.

35 వేల మందికి ఉపాధి..

- Advertisement -

ఫాక్స్‌కాన్‌ కంపెనీ నిర్మాణం పూర్తి అయితే దాదాపు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఫాక్స్‌కాన్‌ సంస్థ అందుకు అంగీకరించింది. దాంతో రాష్ట్ర సర్కార్‌ కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ సంస్థకు 196 ఎకరాల భూమిని కేటాయించింది. కంపెనీకి అప్పగిస్తూ అన్ని సదుపాయలను కల్పించింది. ఇవాళ ఉదయం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ యంగ్‌ ల్యూతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు పాల్గొననున్నారు.

70 శాతం ఫ్యాక్స్‌కాన్‌ నుంచే..

ఐఫోన్లు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగినవి. యాపిల్‌ సంస్థ నుంచి భారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌ పొందింది. కొంగరకలాన్‌లో నెలకొల్పనున్న ప్లాంట్లలో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం యాపిల్‌ ఐఫోన్లలో 70 శాతం ఫాక్స్‌కాన్‌ ఉత్పత్తి చేసినవే. ఇటీవలే యాపిల్‌ కంపెనీ ఎయిర్‌ పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటి వరకూ కేవలం ఫోన్లను మాత్రమే తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌.. ఇప్పుడు కొత్తగా ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది.

ఆకట్టుకున్న సర్కార్‌ విధానాలు..

చైనాకు చెందిన కంపెనీలు యాపిల్‌కు వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌, ఛార్జర్లు వంటివి సరఫరా చేస్తుండేవి. కరోనా వైరస్‌, చైనా దేశంతో ఉన్న ఇతర కారణాల రీత్యా తమ కార్యకలాపాలను అక్కడ తగ్గించాలని నిర్ణయించుకున్నారు. భారత్‌కు తన వ్యాపారాన్ని విస్తరించాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ తెలంగాణ కేంద్రంగా యాపిల్‌ ఫోన్‌కు ఇయర్‌ఫోన్లు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలో ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌.. భారత్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని భావించింది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఫాక్స్‌కాన్‌ను తమ రాష్ట్రానికి రప్పించేందుకు శతవిధాల ప్రయత్నించాయి. కంపెనీ ప్రతినిధులు పలు ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రగతిశీల విధానాలు, స్నేహపూర్వక వాతావరణం, సులభతర విధానాలు ఫాక్స్‌కాన్‌ను ఆకట్టకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వ్యవహారశైలి ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ను విశేషంగా ఆకర్షించింది. దీంతో ఇతర రాష్ట్రాలను కాదని ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement