Saturday, January 25, 2025

ADB – ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబానికి బిఆర్ఎస్ రూ. ల‌క్ష సాయం..

ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తాండ గ్రామానికి చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్ర‌వారం బీఆర్ఎస్‌ రైతు అధ్యయన కమిటీ ప‌రామ‌ర్శించింది. బీఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన క‌మిటీ ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌న్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని అన్నారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన రైతు కుటుంబాల‌కు బీఆర్ఎస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ప్రజలను, రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, కేసీఆర్ త్వరలోనే వచ్చి అందరిని కాపాడుకుంటారని అన్నారు. ప‌దేళ్ల పాలించిన‌ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కంటికి రెప్పలా కాపాడుకుంద‌ని గుర్తు చేశారు.

కేసీఆర్ నియ‌మించిన క‌మిటీ
రైతుల ఆత్మ‌హ‌త్య‌లు అధ్య‌య‌నం కోసం బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నియ‌మించారు. క‌మిటీ చైర్మన్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , సభ్యులు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, ఎమ్మెల్సీలు ఎంసి కోటి రెడ్డి , యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మహ‌త్య చేసుకున్న రైతు ఆడే గజానంద్ కుటుంబానికి సొంత డబ్బులు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అంద‌జేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement