Friday, November 22, 2024

పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ను నిలిపేసిన అదానీ.. హిండెన్‌బర్గ్‌ దెబ్బకు నిలిచిపోయిన ప్రాజెక్ట్‌

ప్రపంచ కుబేరుడిగా అనతి కాలంలోనే రాకేట్‌ వేగంతో ఎదిగిన అదానీ గ్రూప్‌ అధినేత గౌతం అదానీ హిండెన్‌బర్గ్‌ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. తాజాగా 34,900 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ను నిలిపేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు సమీపంలో దీన్ని నిర్మించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధంగా ముంద్రా పెట్రోకెమ్‌ లిమిటెడ్‌ను 2021లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ను గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌కు చెందిన భూమిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ జనవరి 24న అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలతో సంచలన నివేదికను వెలువరించింది.

స్టాక్స్‌లో అవకతవకలకు పాల్పడుతుందని, అకౌంట్స్‌లో మోసాలు చేస్తోందని, షెల్‌ కంపెనీలు పెట్టి పన్నులు ఎగవేతకు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనిపై అదానీ గ్రూప్‌ ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నెలకొల్పలేకపోయారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదానీ జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో మాత్రం అన్ని కంపెనీల షేర్లు 60 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీలు 140 బిలియన్‌ డాలర్ల సంపద నష్టపోయాయి.

- Advertisement -

ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పోందుకు అదానీ గ్రూప్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారీగా ఉన్న రుణాలను చెల్లించండం మొదలు పెట్టింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న కొన్ని రుణాలను సమయానికి చెల్లించింది. రుణ భారాన్ని తగ్గించుకోవడం ద్వారా తిరిగి మార్కెట్‌లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. అదానీ గ్రూప్‌కు ఉన్న రుణాల మూలంగా ఏ క్షణమైన అది తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చని గతంలోనూ కొన్ని ఏజెన్సీలు హెచ్చరించాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది.

ఇప్పటికే అదానీ గ్రూప్‌ కొన్ని ప్రాజెక్ట్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా భారీ ప్రాజెక్ట్‌ పెట్రోకెమికల్స్‌ పనులను సస్పెండ్‌ చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ గ్రీన్‌ పీవీసీ ప్రాజెక్ట్‌ను సంవత్సరానికి 1 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. తదుపరి నోటీస్‌ ఇచ్చే వరకు పెట్రోకెమ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని పనులను, కార్యకలాపాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. సరఫరాదారులు వెంటనే అన్ని సప్లయ్‌లను నిలిపివేయాలని కోరింది. ఇది ఊహించని పరిణామం అయినప్పటికీ, తప్పలేదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లోని వివిధ ప్రాజెక్ట్‌లను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం నిలిపివేసిన ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌ బొగ్గు ఆధారితంగా నిర్మిస్తోంది.

అదానీకి చెందిన ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. పీవీసీ పాలిమార్‌ను ఉత్పత్తి చేయనుంది. పీవీసీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. మన దేశంలోనూ సంవత్సరానికి 3.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల అవరం ఉందని అంచనా. ఈ పరిశ్రమ ఏటా 7 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నది. ప్రస్తుతం మన దేశంలో పీవీసీ పాలిమార్‌ 1.4 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దేశీయ అవసరాలకు ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్నాం.
అదానీ గ్రూప్‌ ఇటీవలే 7 వేల కోట్ల బొగ్గు ప్లాంట్‌ కొనుగోలు ని ర్ణయాన్ని కూడా రద్దు చేసుకుంది.

గ్రూప్‌ సంస్థల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం, రుణాలు చెల్లించడం, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడం ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్లను పుంజుకునేలా చేయడంపై ప్రస్తుతం అదానీ గ్రూప్‌ దృష్టి కేంద్రీకరించింది. ప్రాజెక్ట్‌ల పున: సమీక్ష తరువాత భవిష్యత్‌లో నగదు లభ్యత, ఆర్ధిక వనరుల అధారంగానే నిర్ణయం తీసుకుంటామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement