మయన్మార్ పోర్ట్ విక్రయాన్ని 30 మిలియన్ డాలర్లకు పూర్తిచేసినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మయన్మార్ పోర్ట్ అమ్మకం కోసం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్పిఎ)పై సంతకం చేస్తున్నట్లు మే 2022లో ఎపిసెజ్ ప్రకటించింది. అయితే కొన్ని షరతుల మేరకు ఈ విక్రయ డీల్ జరిగింది. ఇందులో ప్రాజెక్ట్ పూర్తి చేయడం, కొనుగోలుదారు వ్యాపారాన్ని సజావుగా నిర్వహించడం కోసం సంబంధిత ఆమోదం తదితరాలు ఉన్నాయి.
ఆమోదం ప్రక్రియలో నిరంతర జాప్యం, నిర్దిష్ట సీపీల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, యదాతథ స్థితి ప్రాతిపదికన ఈ డీల్ స్వతంత్ర విలువను పొందిందని ఏపీసెజ్ పేర్కొంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత 3 పనిదినాల్లోపు విక్రేతకు పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తారు. మొత్తం లావాదేవీ విలువను స్వీకరించిన తర్వాత, ఏపీసెజ్ ఈక్విటీని కొనుగోలుదారుకు బదిలీ చేస్తుంది.