26వ స్థానానికి పడిపోయిన అదానీ
ముంబై : హిండెన్‌బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ వ్యాపార సామ్రాజ్యం బుధవారం నాడు మరింత దెబ్బపడింది. అదానీపై వికీపీడియా చేసిన ఆరోపణల సెగతో స్టాక్‌మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లన్నీ భారీగా పతనమయ్యాయి. తాజాగా మార్కెట్లో మరింత సంపద అవిరి కావడంతో అదానీ వ్యక్తిగత సంపద 43.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 26 స్థానానికి పడిపోయారు. కొంత కాలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో కొన్నింటికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వరసగా అదానీ గ్రూప్‌పై వస్తున్న వార్తలతో బుధవారం నాడు ఒక్క రోజే 51,294 కోట్ల మేర నష్టపోయింది. వికీపీడియా ఆరోపణలకు, మార్కెట్ల బలహీనత కూడా తోడు కావడంతో నష్టం మరింత పెరిగింది. ఇప్పటి నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీలకు 11.5 లక్షల కోట్ల మేర మార్కెట్ సంపద కరిగిపోయింది. నివేదికకు ముందుతో పోలిస్తే సంపద 60 శాతానికి పైగా నష్టపోయింది. బుధవారం నాడు స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ గ్రీన్‌తో అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, ఎన్‌డీటీవీ షేర్లు నష్టపోయాయి.
సెబీ విచారణ…
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ ద ర్యాప్తు ప్రారంభించింది. తాజాగా అదానీ కంపెనీలు తీసుకున్న రుణాలు, జారీ చసిన సెక్యూరిటీలపై రేటింగ్స్‌ను తెలియజేయాలని దేశీయ రేటింగ్ సంస్థలను సెబీ ఆదేశించింది. షేర్ల పతనం తరువాత ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపడం కోసం అదానీ గ్రూప్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కొన్ని రుణాలను చెల్లించింది. రెండు రోజుల క్రితమే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌కు 1500 కోట్లు అదానీ గ్రూప్ చెల్లించింది. ఈ రుణాలపై రేటింగ్ తెలియజేయాలని సెబీ ఆదేశించింది. ఇది కూడా అదానీ షేర్లపై ప్రభావం చూపించింది.
ముంద్రాలో ఏర్పాటు చేయనున్న భారీ ప్లాంట్ నిర్మాణ ప్రణాళికను పున:సమీక్షిస్తున్నట్లు అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం గ్రూప్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టబోమని ఆయన ప్రకటించారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ కొత్త రోడ్డు ప్రాజెక్ట్‌లకు బిడ్డు దాఖలు చేయడంలేదని తెలిపింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.