కరోనా కాలంలోనూ అదానీ సంస్థ దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా ఎస్బీ ఎనర్జీ ఇండియాలో 100% వాటా కొనుగోలుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగాను సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, భారతీ గ్రూప్‌లతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.25 వేల కోట్లుగా అదానీ సంస్థ తెలిపింది.
గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి భారత్‌లో ఇదే అతిపెద్ద ఒప్పందంగా తెలుస్తోంది. ఎస్బీ ఎనర్జీలో సాఫ్ట్ బ్యాంక్‌కు 80 శాతం, భారతీ గ్రూప్‌నకు 20 శాతం వాటా ఉండేది. అయితే ఈ మొత్తాన్ని అదానీ గ్రీన్ సొంతం చేసుకున్నట్లుగా ఒప్పందంపై సంతకాలు చేశాయని పేర్కొంది. ఎస్బీ ఎనర్జీ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పునరుత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి నుంచి సుమారు 4,954 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో 84 శాతం సోలార్ ఎనర్జీ (4,180ఎండబ్ల్యూ), విండ్-సోలార్ ఎనర్జీ 9 శాతం(450ఎండబ్ల్యూ), కేవలం విండ్ నుంచి 7 శాతం (324ఎండబ్ల్యూ)ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మరికొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి.