Thursday, November 21, 2024

Adani Effect – స్టాక్ మార్కెట్ పై అదానిపై కేసు బాంబు … న‌ష్టాల‌లో ట్రేడింగ్

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. నేటి ఉద‌యం సెష‌న్ లో సెన్సెక్స్ 430 పాయింట్ల నష్టంతో 77,147 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమై 23,314 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్ షేరు విలువ 20 శాతం పతనమయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.04 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.82 శాతం పడిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.41 శాతం, టీసీఎస్ 0.87 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.80 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

అదానిపై అమెరికాలో కేసు

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు. అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement