న్యూఢిల్లీ – ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్ కు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది జర్మనీకి చెందిన హిండెన్ బర్గ్ సంస్ధ అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇచ్చిన రిపోర్ట్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు కమిటీ
ప్రాథమికంగా ఎలాంటి తప్పిదాలు జరగలేదని నిర్ధారిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత రిటైల్ పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు అదానీ గ్రూప్ తీసుకున్న చర్యల్ని సుప్రీంకోర్టు కమిటీ సమర్ధించింది.
అదానీ గ్రూప్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నియంత్రణలో వైఫల్యం చెందిందని తేల్చడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చిచెప్పింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ ఈ మేరకు అదానీ గ్రూపునకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ తమ ప్రాథమిక దర్యాప్తులో అదానీ గ్రూప్ నుండి ధరల తారుమారు జరగలేదని పేర్కొంది.
రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు అదానీ గ్రూప్ అవసరమైన చర్యలు తీసుకుందని, గ్రూప్ తీసుకున్న ఉపశమన చర్యలు స్టాక్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడిందని సుప్రీంకోర్టు వేసిన నిపుణుల కమిటీ పేర్కొంది.
అదానీ గ్రూప్ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్, సంబంధిత పార్టీల నుండి పెట్టుబడుల విషయంలోనూ ఎలాంటి ఉల్లంఘన కనిపించలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ వెల్లడించింది. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌కు సంబంధించి నియంత్రణ వైఫల్యం కూడా ఏమీ లేదని తెలిపింది.