చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్లోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె 12వ తరగతి చదువుతోంది. విజయ్ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.