హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కొత్తగా నిర్మించి ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నూతన భవనం నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ విధులను నిర్వహించనున్నారు. రేపటినుంచి (సోమవారం) ఈ భవనం నుంచి తమ కార్యకలాపాలు సాగించవచ్చని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)ఉత్తర్వులు జారీ చేసింది. సందర్శకులు సెలవు రోజులు మినహా మిగతా పని దినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చని జీఏడీ తెలిపింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.
దివ్యంగులు, వృద్ధుల కోసం ప్రధాన ద్వారం నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ఏర్పాటు చేసింది. సందర్శకుల ముఖ గుర్తింపు ద్వారా వారి సమాచారం ఆధార్ డాటాతో అనుసంధానమవుతుంది. సందర్శకులు నేరుగా మంత్రులు, కీలక అధికారుల కార్యాలయాలను సందర్శించకుండా ఉండేందుకు నిబంధనలు రూపొందించారు. పరిమిత సంఖ్యలోనే సచివాలయంలోకి సందర్శకులను అనుమతించే అవకాశాలున్నట్టు సమాచారం.
ఏ గేటు ఎవరికి?
తెలంగాణ సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాయువ్య ద్వారాన్ని అత్యవసర సమయాలలో, అవసరమైనప్పుడు మాత్రమే తెరవనున్నారు. ఈశాన్య ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు వెళ్లాల్సి ఉంటుంది. సందర్శకులను ఆగ్నేయ ద్వారం నుంచి వెళ్లాల్సి ఉంటుందని జీఏడీ అధికారులు పేర్కొన్నారు. తూర్పు ద్వారం (మెయిన్ గేటు) ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ ప్రతినిధులు, అతిధులకు మాత్రమే ఈ తూర్పు ద్వారం గుండా ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది.
విశేషాల సమాహారం.. నూతన సచివాలయం
ప్రత్యేక అలంకరణలు, కొత్త ఫర్నీచర్‌తో సచివాలయం లోపల ఆకర్షణీయంగా కనిపించేలా.. ఛాంబర్లు, వర్క్ స్టేషన్లను తీర్చిదిద్దారు. అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి తగిన వసతులు కల్పించారు. ప్రతి అంతస్తులోనూ భోజనశాల, కెప్టేnరియా, టాయిలెట్స్, తదితర వసతులను కల్పించారు. మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా ఏక రూపంలో ఉండేలా చర్యలు తీసుకుంటు-న్నారు. ఇష్టారీతిన కాకుండా అందరికీ ఒకే తరహా ఫర్నీచర్ అమరుస్తున్నారు. సచివాలయంలో మొత్తం 30 సమావేశ మందిరాలు ఉండగా.. అన్ని చోట్ల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించారు. అటు అధికారులు, ఉద్యోగులకు సైతం ఆహ్లాదభరితమైన విశాలమైన గదులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు.