Tuesday, November 26, 2024

చురుకుగా కదులుతున్న నైరుతి.. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వాన చినుకుల కోసం ఆకాశం కేసి ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నలకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించెనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తరించాయని వెల్లడించింది.

కాగా.. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. పశ్చిమదిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. కుమ్రంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, భద్రాచలంలో 42.2 డిగ్రీలు, నల్గొండలో 41.5, రామగుండంలో 41.4 , హన్మకొండలో 41, మెదక్‌లో 40.2 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement