Friday, November 22, 2024

గీత దాటితే చర్యలు తప్పవు.. రుషికొండ ప్రాజెక్టుపై కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రుషికొండ వద్ద మంజూరు చేసిన 19,968 చదరపు మీటర్ల  ప్రాంతం కంటే కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అదనపు నిర్మాణం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖకు తెలుసా అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే బదులిచ్చారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని సమాధానంలో పేర్కొన్నారు. 2021 మే 19న రాసిన లేఖ ద్వారా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 9.88 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం సీఆర్‌జెడ్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే అనుమతించిన ప్రదేశం కంటే ఎక్కువ భాగంలో తవ్వకాలు జరిపి పనులు చేపట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. నిజనిర్థారణ కోసం ఒక కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, నివేదిక అందజేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని కేంద్ర మంత్రి తెలిపారు.

పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 3 ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, మెరుగుపరచడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, తగ్గించడం కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానం ఆధారంగా ఎంపీ జీవీఎల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రుషికొండ ప్రాజెక్టులో సీఆర్‌జెడ్ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ త్వరలోనే బహిర్గతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుమతించిన ప్రదేశం కంటే ఎక్కువ భూభాగంలో నిర్మాణ పనులు చేపట్టి, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా తేలితే పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదని జీవీఎల్ హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement