హైదరాబాద్, ఆంధ్రప్రభ : భూ యాజమాన్య హక్కులకు ఆమడ దూరంలో నిల్చిన రైతులకు ఉపశమనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 40 రకాల సమస్యల పరిష్కారంలో తప్పుల సవరణకు మాడ్యూల్ తెరపైకి రావడంతో సుదీర్గంగా వేచిచూస్తున్న 5లక్షల మంది రైతుల భూ హక్కుల కల నెరవేరనుంది. వారికి పాస్ పుస్తకాలు, ప్రభుత్వ సాయం దిశగా కొంత కార్యాచరణ జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పాస్ పుస్తకాల్లో తప్పులు, సర్వే నెంబర్ల నమోదులో ఇబ్బందులు, ఖాతా నెంబర్లు లేని భూములు, నిషేదిత జాబితా, నాలా భూమిగా నమోదు, ఎసైన్డ్, ఇనాం భూముల హక్కులు, సాగులో ఉన్నా సాగేతర భూమిగా నమోదు, మైనర్ల ఫోటోలు పాస్ పుస్తకాలపై ముద్రించడం. మ్యుటేషన్‌కు ముందు యజమాని మరణిస్తే సమస్యలు, వారసత్వ బదలీలు, ధరణికి ముర్దు రద్దయిన రిజిస్ట్రేషన్ స్లాట్లకు సర్వే సంఖ్య కాకుండా విస్తర్ణం ఆధారంగా అవకాశం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది.
ధరణి రాకముందు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేఁషన్ జరిగినా మ్యుటేషన్ అడ్డుకునే అధికారం తహశీల్దార్‌కు ఉండేది. ధరణి వచ్చాక రికార్డులు సక్రమంగా ఉంటే తిరస్కరించేందుకు వీలు లేకుండా పోయింది. మ్యుటేషన్‌కు గ్రామాల్లో నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు కోరే అధికారం లేకుండా పోయింది. సక్సేషన్‌కు దరఖాస్తులు వస్తే ఆర్‌ఐ గ్రామాలకు వెళ్లి సంబంధిత రైతు సంతానంపై ఆరా తీసే అవకాశం లేదు. కుటుంబ అఫిడవిట్‌ను ప్రామాణికంగా ధరణిలో తీసుకుంటున్నారు.
వారసత్వ భూములను కుటుఉంబ సభ్యుల అనుమతి లేకుండా అమ్ముకునే వీలు గతంలో లేదు. ధరణి వచ్చాక ఎవరిపేరు మీద ఉంటే వారు అమ్ముకునే స్వేచ్చ అమలులోకి వచ్చింది. రికార్డుల్లోకి ఎక్కని రైతులకు మార్గం లేకుండా పోయింది. అసైన్డ్ చట్టం ప్రకారం అసైనీలు చనిపోతే ఆ భూములను వారసుల పేర్లమీద మార్చాలి. కానీ అది జరగడంలేదు. డిజిటల్ సిగ్నేచర్ కాని, పాస్ పుస్తకాలు జారీ కాని భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా 11 లక్షల ఎకరాల భూములకు హక్కులులేవని పాస్ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది.
ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగ్ పాస్ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా యోచిస్తోంది. ధరణిలో సమస్యల పరిష్కారం దిశగా సబ్ కమిటీ కీలక నివేదికను సిద్దం చేసింది. పలు అంశాలతో కూడిన సిఫార్సులను సిద్దం చేసి 34 రకాల సమస్యలకు పరిష్కారమార్గాలుగా కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నేపత్యంలో టీఎం 33 మ్యాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నోటీసుల జారీ పురోగతిలో ఉంది.
ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నెంబర్ తొలగింపు, ఎన్వోసి, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నెంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్ నేచర్, ల్యాండ్ టైప్ మార్చడం, మిస్సింగ్ నెంబర్, కొత్త సర్వే నెంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇంకా కొన్ని… భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నెంబర్లలలోని మొత్తం పట్టా భూములను నిషేదిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నెంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నెంబర్లలోని భూములు నమోదు కాలేదు.
ఈ మిస్సింగ్ డేటాను సేత్వార్, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు భీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. నాలా మార్పిడితో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని, ఈ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకులలో తనఖా పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయేతర భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని భూమి వర్గీకరణ మార్పుకు అవకాశం కల్పించి రైతులకు పాస్ పుస్తకాల అందజేత వంటి పరిష్కారాలను యోచిస్తున్నారు. గజాలలో ఉన్న భూములకు కూడా మ్యుటేషన్ అవకాశం కల్పించాలని, ప్రభుత్వ అసైన్డ్ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోలు మినహా మిగతా వ్యవహారాలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదనంగా డిజిటల్ సంతకాలు, తప్పుల సవరణలకు అవకాశం కల్పించాలని కూడా సిఫార్సులు చేయనున్నారు. నిషేదిత భూముల జాబితాను సబ్ డివిజన్ నెంబర్ల ఆధారంగా తిరిగి నమోదు చేయాలని, సంబంధంలేని మిగతా భూములను జాబితానుండి తొలగించనున్నారు. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీతో క్రయవిక్రయదారులకు అవకాశం ఇచ్చే దిశగా యోచిస్తున్నారు. సర్వే నెంబర్ విస్తీర్ణంలో మార్పులకు, ఆధార్‌కు బదులుగా సంస్థ పాన్ కార్డుతో రిజిస్ట్రేషన్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులకు మళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అమలులోకి తేనున్నారు. సంస్థ భాగస్వాముల రిజిస్ట్రేషన్‌లో సీఐఎన్ బదులుగా పాన్ నెంబర్‌ను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు.