Saturday, November 23, 2024

Delhi | దేశవ్యాప్తంగా క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి చర్యలు.. గోవా రోడ్ మ్యాప్ ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గోవా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి

పర్యావరణహిత పర్యాటక విధానాన్ని అన్ని జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాలు అవలంభించినప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని కేంద్ర పర్యాటక శాఖమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గోవా రాజధాని పనాజీలో జరిగిన జీ20 చివరి (4వ) వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  కేంద్రమంత్రి మాట్లాడుతూ… గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ లో జరిగిన మొదటి పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో, పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో జరిగిన రెండో వర్కింగ్ గ్రూప్ సమావేశంలో, జమ్మూకశ్మీర్ లోని శ్రీ నగర్ లో జరిగిన సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల మధ్య కీలకమైన అంశాలపై లోతైన చర్చజరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను గోవాలో బుధవారం జరిగే పర్యాటక మంత్రుల సమావేశంలో చర్చిస్తామన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో వచ్చే నిర్ణయాలను ‘గోవా రోడ్ మ్యాప్’ పేరుతో తదుపరి కార్యాచరణగా ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి మొదలైన ‘మిషన్ లైఫ్’ కార్యక్రమ స్ఫూర్తితో ‘టూరిజం ఫర్ లైఫ్’ నినాదాన్ని కేంద్ర  పర్యాటక శాఖ ముందుకెళ్తోందని.. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాలను కలుపుకుని ముందుకెళ్తున్నామన్నారు. భారతదేశం అన్నిరకాల పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయన్న కేంద్రమంత్రి.. ఈ సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకుని.. రానున్న రోజుల్లో భారత పర్యాటకాన్ని  కొత్తపుంతలు తొక్కిస్తామన్నారు. స్వదేశ్ దర్శన్, దేఖో అప్నాదేశ్ వంటి కార్యక్రమాల ద్వారా వివిధ పర్యాటక క్షేత్రాల్లో సందర్శకులకు అవసరమైన మౌలికవసతుల కల్పనను వేగవంతం చేశామన్నారు. 

అనంతరం క్రూయిజ్ టూరిజంపై జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.. భారతదేశంలో క్రూయిజ్ టూరిజాన్ని  ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని సానుకూల నిర్ణయాలను.. రాష్ట్రాలతో కలిసి తీసుకుంటామని.. ఓ నిర్మాణాత్మక విధానంతో ఈ రంగాన్నిముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement