ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. విశాఖ వేధికగా సీఎస్కేతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నైపై ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చేజింగ్లో తొలి ఓవర్లోనే వికెట్లు కోల్పోయింది చెన్నై జట్టు. మిడిలార్డర్లో అజింక్యా రహానే (45), డారిల్ మిచెల్ (34) పరుగులు సాధించగా.. శివమ్ దూబే (18) పరుగులకే అవుటయ్యారు. ఆఖరిలో జడేజా 21 (నాటౌట్), ధోని 37 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై గెలుపు భారం అంతా మిడిల్ ఆర్డర్ పైనే. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
ఇక అంతకముందు టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. మరోవైపు ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన పృథ్వీ షా (43) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.