Tuesday, November 19, 2024

Big Story: డ్రంకెన్ డ్రైవ్‌తో ప్ర‌మాదాలు.. ప్రాణాలు తీస్తున్న ర్యాష్‌ డ్రైవింగ్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ తనిఖీలు నిర్వహించే పోలీసులకు పట్టుబడుతున్న వాహనదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. హెల్మెట్‌ ధరించకపోవడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు డ్రైవింగ్‌ చేయడం.. ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రంకన్‌ డ్రైవ్‌లలో పట్టుబడుతూనే ఉన్నారు. అయితే పట్టుబడుతున్న వాహనదారులు మరోసారి తప్పుచేయకుండా పోలీసులు అనేక విధాలుగా, అవగాహన కల్పిస్తూనే ఉన్నా, వాహనదారుల్లో మాత్రం మార్పురాకపోవడం ట్రాఫిక్‌ పోలీసులకు ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులే అధికం..

తాగి వాహనాలు నడపడం ద్వారా ఇతరుల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో విషాదం చోటు చేసుకున్న ఘటనలు ఎన్నోఉన్నాయి. దీంతో డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలను విస్తృతం చేశారు పోలీసులు. రాత్రి పగలు తేడాలేకుండా నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇలా చేపడుతున్న తనిఖీల్లో మందుబాబులు వాహనాలు నడుపుతూ అధిక సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఓవైపు తాగి నడపడం ప్రమాదకరమే కాకుండా, కఠిన శిక్షలు పడతాయని పోలీసులు హెచ్చరిస్తున్నా వారిలో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలాఉంటే, అనేకమంది వాహనదారులు నిబంధనలు పాటించకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వచ్చి రానీ డ్రైవింగ్‌తో అధికవేగంతో దూసుకెళ్తూ, ఇతర ప్రాణాలను గాల్లో కలిసేందుకు కారణమవుతున్నారు. ఇక డ్రైంకన్‌ డ్రైవ్‌లు చేస్తూ, అభంశుభం తెలియని వారిని రోడ్డు ప్రమాదాల బాధితులుగా మారుస్తున్నారు. దీంతో నిబంధనలు పాటించని వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్‌లతో తనిఖీలు చేపడుతూ, తాట తీస్తున్నారు ట్రై కమిషనరేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు. రాత్రి పూట, రద్దీ లేని రోడ్లపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి, చనిపోతున్న ఘటనలు సైతం పెరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

చలాన్లతో మార్పు వచ్చేనా

ట్రై కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్న గణంకాల ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో ప్రధానంగా డ్రంకన్‌డ్రైవ్‌, ఓవర్‌ స్పీడ్‌, డ్రైవింగ్‌ లెసెన్స్‌, హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. పప్రథమంగా డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారు కాగా, రెండో స్థానంలో ఓవర్‌ స్పీడ్‌తో వాహనాలు నడుపుతన్నవారు ఉన్నారు. దీంతో వాహనాలకు చలాన్ల మోత మోగుతున్నా, ఓవర్‌ స్పీడ్‌గా వెళ్తున్నవారే అధికంగా ఉన్నారు. ఓఆర్‌ఆర్‌తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వాహన వేగ పరిమితి నిబంధనలు ఉన్నప్పటికీ, అది తెలిసి కూడా ఓవర్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నావారే ఎక్కువగా ఉన్నారు.

వీటిని కంట్రోల్‌ చేసేందుకు నిత్యం స్పెషల్‌ డ్రైవ్‌లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ, అనేక వాహనాలను సీజ్‌ చేస్తున్నా, పూర్తిస్థాయిలో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తుందంటున్నారు పోలీసులు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో అనే విషయంపై, నిత్యం సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు సోషల్‌ మీడియాతోపాటూ, విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా, కొందరు పదేపదే పోలీసులకు పట్టుబడుతున్నారు.

మార్పు రావాల్సిందే

వాహనదారుల్లో రోడ్డు భద్రతపై మార్పురాకపోతే, రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాకుండా, అనేకమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంది. ఇలాంటివారిపై కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నా రు. ఇక తాగివాహనం నడిపే వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా ఉండేందుకు అనేకచోట్లా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఇంతగా కష్టపడుతున్నా, కొంతమందిలో మార్పురాకపోవడం బాధాకరమనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement