Tuesday, November 5, 2024

Ahmedabad | బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో ప్రమాదం… ఇద్దరు కార్మికులు మృతి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల ఆదిలోనే అపశకునం దొర్లింది. బుల్లెట్‌ ట్రైన్‌ కోసం నిర్మిస్తున్న పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దాంతో అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్న పలువురు కార్మికులు కింద పడిపోయారు. పిల్లర్ల శిథిలాల కింది కార్మికులు చిక్కుకుపోయారు.

ఇద్దరు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. మరో ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల కింది నుంచి తీసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వసాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో వసద్‌ వద్ద జరిగింది.

క్రేన్లు, ఎక్స్‌కవేటర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌లో పనులు చేపడుతుండగా పిల్లర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. బావి పునాది పనుల కోసం ఉపయోగించిన స్టీల్‌, కాంక్రీట్‌ బ్లాకుల తాత్కాలిక నిర్మాణం పడిపోయినట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారి తెలిపారు.

ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం వడోదరలోని మహి నదికి సమీపంలో ఉన్నది. రెండు రాష్ట్రాల రాజధానులను కలిపేలా రూ.1,08,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ప్రాజెక్టు పూర్తయితే.. ఆరు గంటల ప్రయాణంలో రెండు గంటల ప్రయాణ సమయం తగ్గనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement