హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అధికారులు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 30వ తేదీలోపు స్వీకరించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్తో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపు విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు మాత్రం రూ.710 చెల్లించాలి. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 నుంచి 12 వరకు , రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు చెల్లించాలి. రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 తేదీ వరకు చెల్లించాలని అధికారులు తెలిపారు.