(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : ప్రభుత్వం దండిగా వేతనాలు పెంచినా లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. అందిన కాడికి దండుకుంటూనే ఉన్నారు. కడుపుమండిన వాళ్లు అవినీతి నిరోదక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అవినీతి అధికారులు చిక్కుతున్నారు. కొందరు మనకెందుకులే అనుకోవడంతో అవినీతి అధికారులకు కలిసి వస్తోంది. తాజాగా కలెక్టరేట్‌లో భవన యజమానినుండి రూ. 40వేల లంచం తీసుకుంటూ సాంఘీక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ రామ్మోహన్ అడ్డంగా ఏసీబీకి దొరికిపోయాడు. ఇప్పటికే అందులో బాలుర వసతి గృహం కొనసాగుతోంది. అదనంగా మరో ప్లోర్ అద్దెకు తీసుకున్నారు. అద్దె రేట్ ఫిక్స్ చేసే విషయమై సూపరింటెండెంట్ రూ. 40వేలు డిమాండ్ చేయడం భవన యజమానికి ఏసీబీ ఆశ్రయించడం…డబ్బులు తీసుకుంటుండగా నేరుగా పట్టుబడటం చకచక జరిగిపోయింది. గురువారం సాయంత్రం లకిడీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ భవనంలోని సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించింది. సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. సరూర్‌నగర్-2 బాలుర వసతి గృహం ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది. ప్లోర్లను బట్టి అద్దె చెల్లిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలోనే మరో ప్లోర్ తీసుకునేందుకు సాంఘీక సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకుంది. దానికి అద్దె ఫిక్స్ చేసే విషయమై
కార్యాలయ సూపరింటెండెంట్ రామ్మోహన్ భవన యజమాని సోమశేఖర గుప్తా నుండి లంచం డిమాండ్ చేశారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రూ. 40వేలకు ఒప్పందం కుదిరింది. ఇదే విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లగా గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సాంఘీక సంక్షేమ కార్యాలయంలో భవన యజమానికి గుప్తా సూపరింటెండెంట్ రామ్మోహన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు. కార్యాలయంతోపాటు తన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కలకలం….
చాలారోజుల తరువాత కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. సాంఘీక సంక్షేమ శాఖలో ఏసీబీ దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు లోనయ్యారు. ఏమైందనే సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏసీబీ అధికారులు సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్న విషయం చాలా సేపటి వరకు ఎవరికీ తెలియదు. ఒక్కరిగా అందరికీ సమాచారం తెలిసే సరికి చాలామంది కార్యాలయం నుండి కూడా వెళ్లిపోయారు. తెలిసిన వాళ్లు తెలియని వారికి ఫోన్లు చేసి జరిగిన విషయం చెప్పడంతో చాలాందికి తెలిసిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.