హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇప్పటి వరకు అకాల వర్షాలతో రైతులు ఎక్కువగా పంట నష్టపోయే వారు. కాని ఇప్పుడు సీన్ మారింది. అకాల వర్షాలకు రైతులకంటే ఎక్కువగా రైసు మిల్లర్లు నష్టపోవాల్సిన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. భారీ వర్షాలకు వాతావరణం మారడంతో ఆరుబయట నిల్వ చేసిన ధాన్యం టార్పలిన్ షీట్లు కప్పినా ముసుర్లకు తేమ పెరిగి మొలకొస్తోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని, మిల్లుల్లో లెక్కల్లో తేడా ఉందని తదితర పలు సాకులతో ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను నిలిపివేయడంతో కస్టమ్ మిల్లింగ్ నిలిచిపోయింది. మిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో వానాకాలంలో దిగుమతి చేసుకున్న ధాన్యం నిల్వలే రైసు మిల్లుల్లో మూలుగుతున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది యాసంగి ధాన్యం సేకరణ కూడా పూర్తవడంతో ధాన్యం నిల్వకు మిల్లుల్లో స్థలం కొరవడింది. దీంతో రైసు మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.
ఈ పరిస్థిితుల్లో ఇటీవల కురిసన వర్షాల నేపథ్యంలో ఆరు బయట నిల్వ చేసిన ధాన్యంపై టార్పలాన్‌షీట్లను కప్పారు. వర్షాలు రెండు రోజులుగా తెరిపి ఇవ్వడంతో పట్టాలు తొలగించి చూస్తే ధాన్యం బస్తాల్లోనే మొలకెత్తి ఉండడంతో మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వర్షాల ముప్పు పొంచ్చి ఉండడంతో నష్టం భారీ స్థాయిలోనే ఉంటుందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైసు మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయింది. వానాకాలంలో నిల్వ చేసిన ధాన్యానికి తోడు యాసంగి ధాన్యం రావడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పెరిగాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని శ్రీదత్తసాయి రైసు మిల్లులో ఏకంగా 8వేల బస్తాల ధాన్యం తడిసి మొలకలొచ్చింది. అదేవిధంగా… కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, అంబాలాపూర్, కరీంపేట్, మొలంగూర్, మానకొండూరుతోపాటు పలు గ్రామాల్లోని రైస్ మిల్లుల్లో భారీ ఎత్తున ధాన్యం నిమ్ము వచ్చి మొలకొచ్చింది. తడిసిన ధాన్యం సీఎంఆర్‌కు పనికిరాదని, ప్రభుత్వం ఆదుకుంటేనే తాము నష్టాల నుంచి గట్టెక్కగలుగుతామని మిల్లర్లు వేడుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.