Friday, November 22, 2024

వార్‌ జోన్‌లో వెయ్యి మంది మనోళ్లు.. సుమీలో 700, ఖర్కీవ్‌లో 300..

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల విషయంలో కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. వార్‌ జోన్‌లో ఇంకా సుమారు 1000 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్టు తెలిపింది. ఖర్కీవ్‌లో 300, సుమీలో 700 మంది ఉన్నట్టు ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని యుద్ధ వాతావరణ ప్రాంతంలోనే వీరంతా చిక్కుకుపోయినట్టు వివరించింది. వారిని తరలించడానికి బస్సులు ఏర్పాటు చేయడం ఇప్పుడు అతిపెద్ద సవాల్‌ అని పేర్కొంది. రష్య, ఉక్రెయిన్‌ దళాలు ఈ ఏరియాలోనే భీకరంగా పోరాడుతున్నారని వివరించింది. ఉక్రెయిన్‌ గడ్డపై ఉన్న చివరి భారతీయుడిని తరలించే వరకు ఆపరేషన్‌ గంగా కొనసాగిస్తూనే ఉంటామని, 2000-3000 మంది ఉక్రెయిన్‌లో ఉండే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని వార్‌ జోన్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం కోసం ముందుగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వీరిని సురక్షితంగా వార్‌ జోన్‌ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు మార్గాలు అన్వేషించాల్సి ఉందన్నారు. దీని కోసం ఉక్రెయిన్‌, రష్యా దళాల సాయం కోరుతున్నట్టు తెలిపారు.

కాల్పుల విరమిస్తేనే..

కొన్ని గంటల పాటు కాల్పులు విరమిస్తే.. భారతీయులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో తమ తొలి హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 20,000 మంది భారతీయులు ఉక్రెయిన్‌ సరిహద్దులను విడిచి పెట్టారన్నారు. గడిచిన 24 గంటల్లో.. మిషన్‌ గంగలో భాగంగా.. 15 విమానాలు భారత్‌లో ల్యాండ్‌ అయినట్టు వెల్లడించారు. 3000 మందికిపైగా భారతీయులు తిరిగి చేరుకున్నారన్నారు. రానున్న 24 గంటల్లో మరో 16 విమానాలు ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నాయని తెలిపారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా ఇప్పటి వరకు 48 విమానాల్లో.. 10,300 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ప్రత్యేక రైళ్ల కోసం ఉక్రెయిన్‌ అధికారులను అభ్యర్థించామని, కానీ వారు స్పందించలేదని, అందుకే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement