Sunday, November 24, 2024

అబ్‌కీ బార్-మేరా పరివార్ కా సర్కార్.. ఇదే కేసీఆర్ అసలు నినాదం: బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేస్తామని చెబుతున్న ఆ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు అసలు ఉద్దేశం అది కాదని, ‘అబ్ కీ బార్ మేరా పరివార్ కా సర్కార్’ అన్నదే ఆయన అసలు నినాదమని భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రయత్నాలను తప్పుబట్టడం లేదని, కానీ రైతుల కోసం ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల హామీగా ప్రకటించిన రైతు రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిచేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ‘ఫసల్ బీమా యోజన’ రాష్ట్రంలో అమలు కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఇదొక్కటే కాదు, కేంద్ర పథకాలను కేసీఆర్ ప్రజలకు చేరువకాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో యూరియా, ఇతర ఎరువుల కొరత ఎక్కడా లేకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెప్పారు. రైతు సమస్యలను పరిష్కరిస్తున్న బీజేపీతోనే రైతులు ఉన్నారని, టీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేదని, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారన్న భయంతోనే బీఆర్ఎస్ తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అత్యాచారాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని అన్నారు.

ఎర్రకోటపై గులాబీ జెండా పాతాలన్న కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోతాయని రాంచందర్ రావు అన్నారు. బీఆర్ఎస్ జాతీయపార్టీగా గుర్తింపు పొందలేదని వ్యాఖ్యానించారు. పార్టీని జాతీయ స్థాయికి విస్తరించుకోడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, ఎవరికైనా పార్టీని పెట్టుకునే అధికారం ఉందని అన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందలేవని ఆయన సూత్రీకరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకే జాతీయ హోదా రావడానికి 12 ఏళ్ల సమయం పట్టిందని ఉదహరించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మారి దేశవ్యాప్తంగా పోటీచేయక ముందే ఆ పార్టీ అవినీతి జాతీయస్థాయికి చేరిపోయిందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement