Sunday, November 17, 2024

TG | పెద్దల సభలో ప్ర‌జ‌ల గ‌ళంగా అభిషేక్ మను సింఘ్వీ !

ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని గురువారం తాజ్ కృష్ణ హోటల్లో మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్ సంఘీ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడటంలో విజయం సాధించి దేశంలోనే నిష్ణాతులైన గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు గడించిన అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ ప్రజల గొంతుకగా పెద్దల సభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తన గళాన్ని వినిపించనున్నారని అన్నారు.

కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావలసిన హక్కులు దశాబ్ద కాలంగా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వీటిని చట్టసభల్లో, న్యాయస్థానాల్లో వాదించి రాష్ట్రం గెలవడానికి ఉపయోగపడే వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.

దేశంలో ఉన్న అతి కొద్ది మంది నిష్ణాతులైన న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వీ ఒకరని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తిని రాజ్యసభ సభ్యులుగా గెలిపించుకోవడానికి ఓటు వేయడం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షానికి చాలా సంతోషంగా ఉందన్నారు. క్లిష్టమైన కేసులు వాదించాల్సి వచ్చినప్పుడు వారి వాదనలు వినడానికి, వారు తీసుకొచ్చిన తీర్పులు చూడటానికి దేశ ప్రజలు చాలా ఆసక్తిగా చూసిన సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం, చట్టాలను నిలబెట్టడం కోసం సుప్రీంకోర్టు ఇతర న్యాయస్థానాల్లో వారు చేసిన వాదనలు సాధించిన విజయాల అనుభవాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టసభల్లో వాదించి రాష్ట్రం గెలుపొందాడడానికి ఉపయోగపడే వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీ తప్ప మాకు మరొకరు రాజ్యసభ ఎన్నికల్లో తమకు కనిపించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement