న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ 5 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో తనను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 19ను పరిగణలోకి తీసుకోకుండా అరెస్టు చేసిందని, ఈ పరిస్థితుల్లో తన అరెస్టు చట్టబద్ధం కాదని పేర్కొంటూ అభిషేక్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిషేక్ గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇదే అభ్యర్థనతో అభిషేక్ గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అభిషేక్ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఈడీ కౌంటర్‌పై రిజాయిండర్ దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్ అభిషేక్ బోయినపల్లికి సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 4న చేపట్టనున్నట్టు వెల్లడించింది.
ఇదే కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కూడా డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఈడీ అరెస్టు చేసిందని గుర్తుచేశారు. ఈడీ తరఫు న్యాయవాదులు ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి అభిషేక్ బోయినపల్లికి రూ. 3.85 కోట్లు బదిలీ అయినట్టు గుర్తించామని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది.