హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో శనివారం 15 ఏళ్ల చిరుత గుండెపోటుతో మృతి చెందింది. ‘అబ్దుల్లా’ అనే పేరు గల చిరుతను సౌదీ యువరాజు పదిఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులోకు బహుమతిగా ఇచ్చారని జూ అధికారి ఒకరు తెలిపారు. జూ అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా ఆ చిరుత గుండెపోటుతో మృతి చెందినట్లు వారు తెలిపారు.
2012లో హైదరాబాద్‌లో జరిగిన CoP11 సమ్మిట్ సందర్భంగా జూను సందర్శించిన సందర్భంగా సౌదీ యువరాజు ‘బందర్ బిన్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సౌద్’ రెండు జతల ఆఫ్రికన్ సింహాలు, చిరుతలను జూకి బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాతి సంవత్సరం 2013లో నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు సౌదీ అరేబియా జాతీయ వన్యప్రాణి పరిశోధనా కేంద్రం నుండి జంతువులను పంపింది.
అయితే, ‘హిబా’ అనే ఆడ చిరుత పారాప్లేజియా తో 2020లో మరణించింది. ఇక అప్పటి నుండి ‘అబ్దుల్లా’ అనే మగ చిరుత ఒంటరిగానే ఉంది. ఇక అబ్దుల్లా మరణం తరువాత నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం చిరుత పులులు లేవు.