Wednesday, November 20, 2024

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, టేపుల్లో వాస్తవాలు.. తెరవెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలి: సిసోడియా

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి వారిని బీజేపీలో చేర్చుకునేందుకు యత్నించారని ఆరోపిస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇవ్వాల (శనివారం) బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. ఈ కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడానికి ‘ఆపరేషన్ కమలం’ పేరుతో యాక్షన్​ ప్లాన్​ అమలుచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు.

గతంలో ఢిల్లీ, పంజాబ్, ఇతర ఎనిమిది రాష్ట్రాల్లో ఇట్లాగే బీజేపీ వేట కొనసాగించిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత పేర్కొన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ ఆడుతున్న డర్టీ గేమ్ మరోసారి తెరపైకి వచ్చిందని అన్నారు. బీజేపీలోకి మారడానికి కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను కలిగి ఉన్న ఆడియో క్లిప్‌ను ప్రస్తావిస్తూ.. అందులో ఒక “షాజీ” గురించి ప్రస్తావించినట్లు సిసోడియా అన్నారు. “నిజానికి ‘షాజీ’ అయితే. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను అరెస్టు చేసి విచారించాలి. ఎందుకంటే ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ బ్రోకర్‌ పట్టుబడితే అందులో దేశంలోని హోంమంత్రి పేరు ఉంటే అది యావత్‌ దేశానికే ప్రమాదకరం అని మండిపడ్డారు.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని టీమ్​ ముగ్గురు వ్యక్తులను రివర్స్​ ట్రాప్​ చేసి తెలంగాణలో అరెస్టు చేయించింది.  నిందితులను హైదరాబాద్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు.  ఇక.. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, AAP నాయకత్వం ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ తన ఎమ్మెల్యేలకు ₹ 20 కోట్లు ఆఫర్ చేసిందని మనీష్​ సిసోడియా ఆరోపించారు. ఈ వాదనలను బీజేపీ తోసిపుచ్చింది. ఆప్ యొక్క ఢిల్లీ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ ఆరోపించిన ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ సిసోడియా తెలంగాణలో బయటపడ్డ రెండో ఆడియో రికార్డింగ్‌ను ఉదహరించారు. ఈ కేసులో నిందుతులు ఎవరైనా, ఎంత పెద్దవారైనా సరే అరెస్టు చేసి విచారణ జరపాల్సిందేనని సిసోడియా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement