Saturday, November 23, 2024

మధ్యప్రదేశ్​లోకి ఆమ్​ఆద్మీ ఎంట్రీ.. సింగ్రౌలీ కార్పొరేషన్​పై ఆప్​ జెండా!

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీపార్టీ (AAP) విజయపతాక ఎగరేసింది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా.. సింగ్రౌలీ మునిసిపల్​ కార్పొరేషన్​ని మాత్రం ఆప్​ ఎగరేసుకుపోయింది. అయితే ఈ ఎన్నికలతో తొలిసారి ఆప్​ మధ్యప్రదేశ్​లో అడుగుపెట్టనట్టయ్యింది. అయితే.. మధ్యప్రదేశ్​లోని సింగ్రౌలీ ప్రాంతం మొత్తం బొగ్గు తవ్వకాలతో నిండి ఉంటుంది. దీన్ని భారత దేశ ‘ఇంధన రాజధాని’ అని కూడా పిలుస్తారు. ఇట్లాంటి కీలకమైన ఏరియాలో ఆమ్​ఆద్మీ పట్టు సాధించడం గొప్ప విషయమనే అంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు. ఇక.. మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చంద్రప్రకాశ్ విశ్వకర్మపై ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు.

అగర్వాల్ 9,159 ఓట్ల తేడాతో గెలుపొందడంతో బీజేపీ, కాంగ్రెస్‌  రెండు, మూడు స్థానాలకు పరిమితం అయ్యాయి. ఆప్ అభ్యర్థికి మొత్తం 34,038 ఓట్లు, బీజేపీకి 24,879, కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ చందేల్‌కు 24,60 ఓట్లు వచ్చాయి. అయితే.. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కరెక్ట్​గా ఒక సంవత్సరం ముందు.. మధ్యప్రదేశ్​లో ఆమ్​ఆద్మీ పార్టీ అడుగుపెట్టడం శుభసూచకమని, అగర్వాల్ విజయం మధ్యప్రదేశ్‌లోని ఆప్ కేడర్‌కు నైతిక బూస్టర్‌గా నిలుస్తుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.

ఇక.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ్రౌలీలో రోడ్ షోలో పాల్గొన్నారు. అగర్వాల్ విజయం తర్వాత కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో అభినందిస్తూ, “సింగ్రౌలి మేయర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి రాణి అగర్వాల్ జీ, ఇతర విజేతలు.. పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నాను. ప్రజల కోసం కష్టపడి పని చేస్తూనే ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడుతున్నారు”అని రాశారు.

- Advertisement -

ఇవ్వాల మొదటి దశలో 11 మునిసిపల్ కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. కాంగ్రెస్ జబల్‌పూర్‌ను గెలుచుకుంది. గ్వాలియర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భోపాల్, ఇండోర్ రెండింటిలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ కూడా మధ్యప్రదేశ్‌లో అర్బన్ బాడీ ఎన్నికల్లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ మహిళా అభ్యర్థి ఖండ్వా నగరంలో కార్పొరేటర్ పదవిని గెలుచుకున్నారు.

కాగా, భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్, సాగర్, సత్నా, సింగ్రౌలి, చింద్వారా, ఖాండ్వా, బుర్హాన్‌పూర్, ఉజ్జయిని సహా 11 మున్సిపల్ కార్పొరేషన్‌లలో మేయర్ పదవులకు పోలింగ్ జరిగింది. మేయర్​ పదవుల కోసం మొత్తం 101 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్​ మున్సిపల్ ఎన్నికల రెండో దశ ఓట్ల లెక్కింపు జులై 20న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement