ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ కష్టాలు పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానికులు సంగీత కచేరి ప్రదర్శన నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేతలు నిర్వహించిన ఈ కచేరిలో పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని కాకుండా ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. ప్రజలు ఓట్లు వేసి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారని ప్రశ్నించారు. కనీసం గతుకుల రోడ్లను కూడా బాగు చేయించని వారిని ఎన్నుకుంటే ప్రయోజనం ఏంటని నిలదీశారు.
ఈ సందర్భంగా ఆప్ నాయకుడు విశాల్ కేల్కార్ మాట్లాడుతూ… కోబ్రా జిల్లా వ్యాప్తంగా రోడ్లు ఇలాగే ఉన్నాయని చెప్పారు. ఇందుకు కారణం ప్రజలేనని అన్నారు. ఇకనైనా తమ ఓట్లను అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే ఓట్లు వేయాలని చెప్పామని అన్నారు. సంగీత ప్రదర్శనతో తాము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.