Wednesday, November 20, 2024

ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి.. పదేళ్లకోసారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి

ఆధార్‌ కార్డుకు సంబంధించిన వివరాల నవీకరణపై కేంద్రం కచ్చితమైన ప్రకటన చేసింది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను పునరుద్ధరించుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం నిబంధనల్ని సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 134 కోట్ల ఆధార్‌ నంబర్లు జారీ చేయబడ్డాయి. వీటిలో కొన్ని ఆధార్‌ కార్డుల వివరాలు సరిగాలేవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్‌డేషన్‌పై దృష్టిసారించింది. ఆధార్‌ పొందిన ప్రతివ్యక్తి, పదేళ్లకోసారి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలు పొందడంలో ఆధార్‌ కీలకంగా మారిన విషయం తెలిసిందే. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, ఆధార్‌ పొంది పదేళ్లు పూర్తయిన ప్రతివ్యక్తి కనీసం ఒక్కసారైనా వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. దీనివల్ల కేంద్ర సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్‌)లో డేటా పక్కాగా నిక్షిప్తం అవుతుంది అని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ , ఐటీ శాఖ తెలిపింది. పదేళ్లకోసారి వ్యక్తిగత ధ్రువీకరణ (పీఓఐ), ఇంటి చిరునామా ధ్రువీకరణ (పీఒఏ) పత్రాలను సమర్పించడం ద్వారా సీఐడీఆర్‌లో సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటుందని పేర్కొంది.

గత నెలలోనే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అప్‌డేట్‌ డాక్యుమెంట్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ యూజర్లు మై ఆధార్‌ పోర్టల్‌ లేదా మై ఆధార్‌ యాప్‌ ద్వారా కానీ, దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లిగానీ పేరు, ఫొటో, అడ్రస్‌ వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని యూఐడీఏఐ విజ్ఞప్తిచేస్తోంది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సుమారు వెయ్యి పథకాలు అర్హులైన వారు పొందగలరని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement