Sunday, November 10, 2024

America : లైక్ ల కోసం లైవ్ లో కసకస..

సోష‌ల్ మీడియాలో లైక్ ల కోసం, సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అలాగే ఓ యువ‌తి యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా దారుణానికి తెరదీసింది. లైవ్‌లోనే జంతువులను చిత్రహింసలకు గురిచేసి చంపడం మొదలుపెట్టింది. ఈ మేరకు నాలుగు లైవ్ వీడియోలను గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల అనిగర్ మోన్సీ అనే యువతి జీవహింసకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.

ప్రాణంతో ఉన్న జంతువులను హింసిస్తున్నట్లుగా, వికృతంగా వ్యవహరిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. లైవ్‌లో కోడి, పావురం, కుందేలు, కప్పల శరీర భాగాలను ముక్కలుగా కోస్తున్న నాలుగు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను ఆమె ఛానల్‌లో గుర్తించామని, గతవారం ఆమెపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వేర్వేరు జంతువులను పట్టుకొని హింసించడం ద్వారా సబ్‌స్క్రైబర్లను పొందిందని, లైవ్‌లోనే వాటిని పట్టుకునేదని తెలిపారు.

జంతువుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనాగరికమని, అమానవీయమని అప్పర్ డార్బీ పోలీస్ సూపరింటెండెంట్ అధికారి తిమోతీ బెర్న్‌హార్డ్ హెచ్చరించారు. జంతువులను చంపడమే కాకుండా ఇలా చేయాలంటూ దాదాపు 20వేల మంది సబ్‌స్క్రైబర్లను ప్రోత్సహించడం వాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కాగా అరెస్టుకు ముందు గత శుక్రవారం ఆమె చివరి వీడియోను పోస్ట్ చేసింది. ‘కుకింగ్ లక్కీ’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మోన్సీ వంట గదిలో ఒక కోడిని హింసించి చంపింది. కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వంటగది సింక్‌పై కోడి మెడను కత్తితో కోసింది. ఇక వీడియో చేసే సమయంలో ఆమె లైక్స్ కొట్టాలని కోరుతోంది. లైవ్‌ చూసే వారి సంఖ్య పెరిగిన తర్వాత జంతువులను చంపుతుండేదని వీడియోల ద్వారా స్పష్టమైంది. అనేక కప్పలు, పక్షులను చంపింది. ఒక వీడియోలో మొండి కత్తితో కుందేలుని చంపిందనే ఆరోపణలున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement