ఆగడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జనాలపై సినిమా ప్రభావం గట్టిగానే పడిందంటూ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా… అనుకుంటున్నారా!! మామూలుగా ఈ జనరేషన్ యూత్ హీరోస్ ని , క్రికెటర్స్ ఇలా వారి అభిమానించే వారిని అనుకరిస్తూ ఉంటారు. వారి లానే హెయిర్ స్టైల్ మార్చుకోవటం, వారిలానే బట్టలు వేసుకోటం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అలా అనుకరించే క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఇప్పుడు చెప్పే సంఘటన కూడా అలాంటిదే.
యూట్యూబ్ లో ఓ వీడియో చూసిన బాలుడు తన జుట్టుపై ప్రయోగం చేశాడు. హెయిర్ స్టైల్ కొత్తగా రావాలని చెప్పి తల పై కిరోసిన్ పోసుకుని తగల పెట్టుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళితే తిరువనంతపురం వెంగనూర్ ప్రాంతానికి చెందిన శివ నారాయణన్ వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఏడవ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే శివ నారాయణన్ తన హెయిర్ స్టైల్ ను ట్రెండీగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్ లో వీడియో చూశాడు. అందులో తలపై మంట పెట్టి హెయిర్ స్ట్రయిట్ చేస్తున్నారు. అది చూసిన శివ నారాయణన్ ఇది ఎలాగైనా మనం కూడా చేసి అందంగా హెయిర్ స్టైల్ ను మార్చుకోవాలని కిరోసిన్ తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు. తలపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. ఆ ప్రయోగం కాస్త రివర్స్ అయింది. వెంటనే పెద్దగా తలపై మంటలు అంటుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో శివ నారాయణన్ నానమ్మ ఒక్కరే ఉన్నారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి గాయాలపాలైన శివ నారాయణన్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శివ నారాయణన్ మృతి చెందాడు. దీనితో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎవరు కూడా సోషల్ మీడియాలో అలాంటి వీడియోలను చూసి అనుకరించి వద్దని వారు కోరారు.