Saturday, November 23, 2024

వేడెక్కిపోతున్న భూగోళం.. దశాబ్దానికి 0.2 డిగ్రీలు చొప్పున పెరుగుతున్న భూతాపం

నానాటికి పెరిగిపోతున్న భూతాపంపై ప్రపంచవ్యాప్తంగా 50 అగ్రశ్రేణి శాస్త్రవేత్తలతో కూడిన బృందం ప్రమాద ఘంటికలు మోగించింది. 2013 నుంచి 2022 మధ్య కాలంలో మానవ ప్రమేయంతో భూతాపం అనూహ్యంగా దశాబ్దానికి 0.2 డిగ్రీలు సెల్సియస్‌ చొప్పున పెరిగిపోతున్నదని బృందానికి నాయకత్వం వహించిన లీడ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పియర్స్‌ ఫోర్స్‌స్టర్‌ హెచ్చరించారు.

ఈ మేరకు విధానరూపకర్తలు లక్ష్యంగా సదరు బృందం ఒక అధ్యయనం చేసి ఫలితాలను వెల్లడించింది. వాతావరణానికి సరిచేయలేని విధంగా విధ్వంసాన్ని చేకూర్చే దిశగా భూగోళం ప్రమాదపుటంచుల్లోకి చేరుకుందని ఇంటర్‌గవర్నమెంటల్‌ పానెల్‌ ఆన్‌ క్లయిమేట్‌ చేంజ్‌(ఐపీసీసీ) నివేదిక పేర్కొన్న నేపథ్యంలో తాజా అధ్యయనం చర్చనీయాంశమైంది.

ముంచుకొస్తున్న ముప్పు నుంచి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచం ప్రస్తుతం తాను వెదజల్లుతున్న గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలపై 60 శాతం కోత విధించాలని సదరు నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోవడంలో కీలక చోదక శక్తిగా మానవ ప్రేరేపిత కార్యకలాపాలు ఉన్నట్టు ఐపీసీసీ నివేదిక గుర్తించింది. వాతావరణ మార్పుపై ఈ ఏడాదిలో దుబాయ్‌లో ప్రపంచనేతలు కాప్‌28 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న తరుణంలో తాజా అధ్యయనం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement