ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 23 మందిని రక్షించగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు వెల్లడించారు. అలాగే గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.