Friday, November 22, 2024

Delhi: మానేసర్‌లో ఏపీ మంత్రుల బృందం.. అంబేద్కర్ విగ్రహం తయారీ పనుల పరిశీలన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నాటికి విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. హర్యానాలోని మానేసర్ వద్ద తయారవుతున్న విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విగ్రహ తయారీ పనులన్నీ వేగంగా సాగుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు మంత్రి నాగార్జున తెలిపారు. రూ. 250 కోట్ల ఖర్చుతో 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో నెలకొల్పనున్నట్టు వెల్లడించారు.

విగ్రహాన్ని పరిశీలించిన బృందంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ మేరుగు నాగార్జునతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సోషల్ వెల్ఫేర్ విభాగం ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ ప్రసాద్, కేపీసీ ప్రాజెక్ట్స్ ఎండీ అనిల్ కుమార్ తదితరులున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి బయల్దేరిన మంత్రులు, అధికారుల బృందం హరియానా మానేసర్‌లో విగ్రహం తయారవుతున్న ప్రదేశానికి చేరుకుని తయారీ పనులను పరిశీలించారు. విగ్రహాన్ని అనుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement