హైదరాబాద్, ఆంధ్రప్రభ: తనను చంపేందుకు కుట్ర జరగుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే తనపై మునుగోడులోని పలివెలలో దాడి జరిగిందన్నారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలో తానూ ఓ సభ్యుడినన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని, తనపై ఈగ వాలినా బీజేపీ చూస్తూ ఊరుకోదని ఘాటుగా స్పందించారు. తనపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనియరా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో అవసరం లేకున్నా అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆడిస్తే ఆడే తోలు బొమ్మలకు, చెంచాలకు బీజేపీ భయపడదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమితో తనపై సీఎం కేసీఆర్ పగపట్టారని, మునుగోడులో డబ్బు, మద్యంని ఏరులు పారించారని మండిపడ్డారు.