హైదరాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయరంగ బలోపేతం, రైతుల అభివృద్ధే లక్ష్యంగా ఇక్రిశాట్ – జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో ఆరుతడి పంటలు, వాతావరణ, స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈమేరకు సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్డీపీఆర్ కార్యాలయంలో ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్ హ్యూస్, ఎన్‌ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జీ. నరేంద్ర కుమార్ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధుల సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం గ్రామీణాభివృద్ది, పేదరిక నిర్మూలన, గ్రామస్థాయిలో ఆహార భద్రతపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆసియా, ఆఫ్రికాలో రుర్బన్ కమ్యూనిటీలకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు ఇరు సంస్థల తమ బలాబలాలను వినియోగించుకోవచ్చని ప్రకటించాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, విలువ గొలుసుఅభివృద్ధి, గుర్తించబడిన వ్యవసాయ, గ్రామీణ, సాంకేతిక పరిజ్ఞానాల స్కేలింగ్ వంటి రంగాల్లో రెండు ప్రధాన సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం చేశాయి.